Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 34

Viswamitra's Lineage !

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

కృతోద్వాహే గతే తస్మిన్ బ్రహ్మదత్తే చ రాఘవ |
అపుత్రః పుత్రలాభాయ పౌత్రీం ఇష్టిమకల్పయత్ ||

తా|| ఓ రామా ! బ్రహ్మదత్తుడు వివాహము చేసికొని వెళ్ళిపోయిన పిమ్మట. పుత్రులు లేని వాడైన ఆ శుకనాభుడు , పుత్రలాభము కొఱకు పుత్రకామేష్టి యాగమును ఆచరించెను.

బాలకాండ
ముప్పది నాలుగవ సర్గము
( విశ్వామిత్రుని జన్మ వృత్తాంతము)

విశ్వామిత్రుడు మళ్ళీ ఇట్లు పలికెను.

'ఓ రామా ! బ్రహ్మదత్తుడు వివాహము చేసికొని వెళ్ళిపోయిన పిమ్మట. పుత్రులు లేని వాడైన ఆ శుకనాభుడు , పుత్రలాభము కొఱకు పుత్రకామేష్టి యాగమును ఆచరించెను. ఆ ఇష్టి కార్యక్రమము జరుగుచున్నప్పుడు పరమ ఉదారుడు , బ్రహ్మ సుతుడు అయిన కుశుడు కుశనాభ మహారాజు తో ఇట్లనెను. " నీతో సమానమైన ధార్మికుడగు పుత్రుడు , గాధి అను పేరుగలవాడు పుట్టును. అతని వలన నీ కీర్తి ప్రతిష్ఠలు శాశ్వతముగా నుండును". ఓ రామా ! కుశుడు ఈ విధముగా మహీపతి అయిన కుశనాభునికి చెప్పి ఆకాశమార్గముద్వారా సనాతనమైన బ్రహ్మలోకమునకు పోయెను'.

కొంతకాలము పిమ్మట జ్ఞాని అయిన కుశనాభునకు పరమ ధార్మికుడు, గాధి అను పేరుగల పుత్రుడు జన్మించెను .ఓ రఘునందనా ! ఆ గాధి అనబడు ఆకాకుత్ స్థుడు పరమ ధార్మికుడు నా తండ్రి. నేను కుశవంశమున జన్మించితిని అందువలన కౌశికుడు అనబడువాడను.

ఓ రాఘవా ! నా అక్క సత్యవతి అను పేరుగలది , వ్రత నిష్ఠగలది. ఆమెకి ఋచీకునితో పెండ్లి జరిగెను. కౌశికీ అనబడు ఆమె భర్తను అనుసరించి శరీరముతో స్వర్గము చేరెను. పరమోదారయగు ఆమె కౌశికీ అనబడు పేరుతో మహనదియై ప్రవహించుచుండెను. దివ్యమైన రమ్యమైన పుణ్యోదకములుగల ఈ నది హిమగిరిని ఆశ్రయించెను. లోకహితము కొఱకై నా సోదరి నదివలె ప్రవహించుచున్నది. ఓ రఘునందనా ! అందువలన నా సోదరియైన కౌశికపై గల ప్రేమతో ఈ హిమాలయప్రాంతమున నేను సుఖముగా నివశించుచున్నాను.

ఆ సత్యవతి పవిత్రురాలు . సత్యము ధర్మము ఆమెకు ప్రాణతుల్యములు ఆమె పతివ్రత. మహాత్మురాలు. ఆకౌశికీ నదులలో శ్రేష్ఠమైనది. ఓ రామా ! నేను ఆ క్రతువు నిర్వహించుటకు ఆ ప్రాంతమునుండి ఇచటికి వచ్చితిని. సిద్ధాశ్రమమునకు వచ్చి నీ పరాక్రమముచే కృతార్థుడనైతిని.ఓ మహాబాహో ! నీవు అడుగుటవలన ఈ దేశము గురించి , మా వంశకీర్తి , నా పుట్టు పూర్వోత్తరములు చెప్పబడడమైనది. ఈ కథా ప్రసంగములతో రాత్రిలో సగభాగము గడిచినది. మనప్రయాణమునకు విఘ్నములేకుండుటకు ఇక నిద్రింపుము.నీకు శుభమగును'.

'ఓ రఘునందనా ! చెట్లు కదలుటలేదు.మృగములు పక్షులు నిద్రలో లీనమై ఉన్నాయి. చీకటి నలుదిశలా వ్యాప్తమైయున్నది. మెల్లిగా సంధ్యా కాలము గడిచినది. నక్షత్ర తారాగణములతో నిండిన ఆకాశము జ్యోతిర్మయములైన నేత్రములతో ఉన్నదానివలె ప్రకాశించుచున్నది. ఓ రామచంద్రా ! చంద్రుడు తన చల్లని కిరణములతో చీకట్లను తీసివేసి లోకములకు ఆహ్లాదము కలగచేయుచున్నాడు. యక్ష రాక్షస సంఘములు , రౌద్రులు , పిశాచరులూ నిశిరాత్రిలో చరించు ప్రాణులన్నియూ అటునిటు తిరుగాడుచున్నవి'.

ఈ విధముగా చెప్పి మహాతేజోవంతుడైన ఆ మహాముని విరమించెను. పిమ్మట ఆ మునులందరూ "బాగు" "బాగు" అని ఆ మహామునిని ప్రస్తుతించిరి. "ఓ మునీ కుశికులయొక్క ఈ వంశము చాలా గొప్పది. ఇది ధర్మమునకు ఆటపట్టు. కుశివంశములో అందరూ నరోత్తములు బ్రహ్మతో సమానమైన మహానుభావులు. మహా యశస్వి అయిన విశ్వామిత్రా ! విశేషముగా మీరు ఇంకనూ గొప్పవారు, కౌశికీ నది అన్ని నదులలో ఉత్తమమైనది". ఈ విధముగా అ మునీశ్వరులందరూ ప్రస్తుతించగా మిక్కిలి సంతుష్ఠుడైన కౌశికుడు అస్తాద్రిని చేరిన సూర్యునివలె నిద్రకు ఉపక్రమించెను.

అంతట ఆరామలక్ష్మణులిద్దరూ కూడా కొంత ఆశ్చర్యపోయి ఆ మునిశార్దులమగు విశ్వామిత్రుని ప్రస్తుతించి నిద్రలో మునిగిరి.

||ఈ విధముగా వాల్మీకి రామాయణములో ని బాలకాండలో ముప్పది నాలుగవ సర్గ సమాప్తము ||
|| ఓమ్ తత్ సత్ ||


రామోs పి సహ సౌమిత్రిః కించిదాగత విస్మయః |
ప్రశస్త్య మునిశార్దూలం నిద్రాం తముపసేవతే ||

తా|| అంతట ఆరామలక్ష్మణులిద్దరూ కూడా కొంత ఆశ్చర్యపోయి ఆ మునిశార్దులమగు విశ్వామిత్రుని ప్రస్తుతించి నిద్రలో మునిగిరి.


|| Om tat sat ||